ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఊహించని నిశ్శబ్దం...

 



ఒక అమ్మాయి ఇష్టాన్ని కన్నవాళ్లు కాదంటే ఎలాగైనా ఒప్పించొచ్ఛు 

అదే కావాలనుకున్నవాడే కాదంటుంటే..? 

ఆ బాధను చెప్పేందుకు మాటలు చాలవు. ఇప్పుడు నాది అదే పరిస్థితి...

చదువైపోయి ఉద్యోగంలో చేరా. నా కాళ్లపై నేను నిలబడుతున్నాననే ఆనందంలో ఉన్న రోజులవి. లోకాన్ని నేను చూసే తీరు మారింది. అదే సమయంలో తనని చూశా. చూడగానే దగ్గరి మనిషిలా అనిపించాడు. అప్పటి వరకూ ప్రేమ అనే పదానికి అర్థమే తెలియని నాకు మొదటి చూపులోనే నచ్చేశాడు. రోజూ తనని చూడాలని, తనతో మాట్లాడాలని అనిపించేది. ఓ రోజు ధైర్యం చేసి మాట్లాడుదామనుకున్నా.. దగ్గరికి వెళ్లా. నా గుండె వేగం రెట్టింపయ్యింది. నోట మాట రాలేదు. ఏదో తెలియని భయం. 

‘హాయ్‌!!’ అని వచ్చేశా.. 

ఆ క్షణంలో ఏం మాట్లాడాలో తోచలేదు. కానీ, ఆనందం ఏంటంటే.. తన కంట్లో పడ్డాను. అది మొదలు.. ఇంకాస్త దగ్గరగా గమనించడం మొదలుపెట్టా. తన అభిప్రాయాలు, ప్రవర్తన, భవిష్యత్తుపై తను తీసుకునే నిర్ణయాలు.. అన్నీ నాకు దగ్గరగా ఉన్నాయి. 

ఓ రోజు తనే నన్ను పలకరించాడు. ఆ మాటలు.. తను తీసుకునే చనువు.. నాలో భయాన్ని పోగొట్టాయి. తన పలకరింపుతో రోజంతా ఎంతో హుషారు. తనతో వేసే అడుగులకు అలసటే తెలిసేది కాదు. చినుకుల్లా మొదలైన మాటలు.. జోరువానలా.. ఓ ప్రవాహంలా సాగాయి. తనతో ఉన్నప్పుడు నాన్న సంరక్షణలో ఉన్నంత భద్రంగా అనిపించింది. అంతా సాఫీగా సాగుతున్న జీవితంలోకి ఓ కొత్త పేజీ తెరిచే టైమ్‌ వచ్చింది.

ఇంట్లో పెళ్లి ప్రస్తావన. చేసుకుంటావా? అంటూ అడుగుతుంటే.. ముఖంలో సిగ్గు చూపిస్తూ. మనసులో భయాన్ని దాచుకున్నా. అదే విషయం తనతో మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకూ నా జీవితాన్ని ఎవరితోనూ ఊహించుకోలేదు. ఒక్క నిన్ను తప్ఫ ఇక మనం ఏడు అడుగులు నడిచే టైమ్‌ వచ్చేసింది’ అని చెప్పేశా. 

కానీ తన నుంచి స్పందన లేదు. మా మధ్య కొన్ని నిమిషాల పాటు నేను ఊహించని నిశ్శబ్దం. తర్వాత నేను ఎప్పుడూ వినని మాటలు.. నేల చూపులు. వాటి వెనకే బాధ్యతలు, బరువులూ అంటూ.. అప్పుడే పెళ్లి ప్రస్తావన వద్దని వెళ్లిపోయాడు.

నన్ను వేచిచూడమనే సమాధానమూ లేదు. ఇంట్లో పెళ్లి మాటలు ఎక్కువయ్యాయి. ఏ క్షణాన ఎవర్ని తెచ్చి కట్టబెడతారో అని అనుక్షణం భయం. ఇక లాభం లేదనుకొని ఇంట్లో చెప్పేశా. ఇంట్లో చాలా రోజులు నాతో ఎవరూ సరిగా మాట్లాడలేదు. వారికీ నాకు మధ్య దూరం పెరిగింది. కన్నవారు కదా.. కొన్ని రోజులకు నా వైపు నుంచి ఆలోచించారేమో.. కోపాన్ని దిగమింగుకుని అబ్బాయిని వచ్చి మాట్లాడమన్నారు. 

నాకైతే నన్ను అర్థం చేసుకున్న కుటుంబం.. కోరుకున్న ప్రియుడు దగ్గరవుతున్నాడనే ఆనందం మాటల్లో చెప్పలేను. తనను వచ్చి మాట్లాడమంటే.. మౌనం వహించాడు. ఆ వెనకడుగు ఉద్దేశం ఏంటో చెప్పడం లేదు. నాకంటే ముందే వాళ్ల ఇంట్లో మా ప్రేమ విషయం చెప్పి, ఒప్పించిన అతను ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు. పెళ్లి విషయం వస్తే ఎందుకు దాటవేస్తున్నాడో తెలియడం లేదు. అడిగితే.. ‘మనిద్దరికీ కుదరదేమో! నేను నీకు తగనేమో!’ అని పిచ్చి ప్రశ్నలు. 

నాతో పంచుకోలేని సమస్యలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే నాతో చెప్పడానికి తనెందుకు సంకోచిస్తున్నాడు. అయోమయం అంటే ఇదేనేమో!! దిక్కు తోచడం లేదు.

‘కృష్ణా... లాభనష్టాలు గురించే ఆలోచించే మనిషి కాదు నువ్వు. నిజం చెప్ఫు నువ్వు చెప్పే కారణం ఏదైనా నేను అర్థం చేసుకోగలను. మనసుని చంపుకోలేక మనిషిని చావలేక నరకయాతన అనుభవిస్తున్నా. నువ్వు లేని లైఫ్‌ని ఊహించలేకపోతున్నా. క్షణం యుగంలా గడుస్తోంది. ఒంటరిగా నేను వేసే అడుగుల్లో ఏదో తెలియని భయం. నీతో కలిసే నా జీవిత గమనం సాగాలనుకుంటున్నా. ఒక్కటి మాత్రం స్పష్టంగా చెబుతున్నా...

మన ప్రేమ కారణాలకు బలయ్యేంత అల్పమైంది కాదు. గుర్తుంచుకో!!


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ..

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు శ్రీ ఎస్.ఆర్ రంగనాథన్ గారి జయంతి ఈరోజు ఆసందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ.... జననం 12 ఆగష్టు 1892 మరణం 27 సెప్టెంబరు1972 గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి, గ్రంథాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన గణిత శాస్త్రవేత్త షియాలి రామామృత రంగనాథన్ గారు ఆగస్టు 12వ తేదిన 1892 తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని షియాలీ అనే గ్రామంలో జన్మించారు. దాదాపు రోజుకు 10–15 గంటలకు పైగా పనిచేస్తూ, వారానికి ఒక్క రోజైనా సెలవు తీసుకోకుండా నిరంతరాయంగా రంగనాథన్ గ్రంథపాలక వృత్తే దైవంగా, పనే జీవితంగా గడిపిన నిర్మలకర్మయోగి. ఆధునిక వైజ్ఞానిక సాంకేతిక రంగాలలో పెను మార్పులు చోటుచేసుకున్న ఈసమయంలో కూడా గ్రంథాలయాల ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుందని ఆనాడే గుర్తించి, గ్రంథాలయాలకు ఒక శాస్త్రాన్ని ప్రవేశపెట్టి, ప్రజలకు విజ్ఞానాన్ని పంచే ప్రజా విశ్వవిద్యాలయాల అని పిలువబడే పౌర గ్రంథాలయాలుకు రూపకల్పన చేశారు. నేడు ఈ ప్రజా విశ్వవిద్యాలయాలకు ప్రజల నుండి ఆదరణ ఉందంటే అది రంగనాథన్ చేసిన కృషి వల్లనే అన్నది నగ్న సత్యం. 1924 సంవత్సరంలో మద్రాస్ విశ్వవిద్యాలయం గ్రంథపాలకునిగా ఆయన నియమితులయ్యారు.. కొద్ది కాలం పాటు ఇంగ్లాండ్ పర్

ఆత్మవిశ్వాసం ఎలా వస్తుందంటే

  ఆత్మవిశ్వాసం అంటే నాలో నాకు నమ్మకం కలిగించిన సన్నివేశాలు మూడో నాలుగో ఉన్నాయి నాకు జ్ఞాపకం ఉన్నవి. చెప్పేను కదా మాఇంట్లో ఎదురుపడి మాట్లాడుకోడం తక్కువే అని. నువ్వు ఆడపిల్లవి ఇలా ఉండాలి, ఇలా చెయ్యి, అలా చెయ్యకూడదు అంటూ ఎప్పుడూ ఏ ఆంక్షలూ లేవు. నీతిపాఠాలు అసలే లేవు. హైస్కూలు రోజుల్లో పరీక్షఫీజు కట్టడానికి నాన్నగారు విద్యార్థులని స్కూలు ఆపీసుకి తీసుకెళ్లేరు. ఆ తరవాత నాకు డబ్బు ఇచ్చి, “వెళ్లి ఫీజు కట్టి రా,” అన్నారు. నాకు కోపం వచ్చింది. “వాళ్ళతో వెళ్లేరు కదా, నాతో ఎందుకు రారూ?” అని అడిగేను. “వాళ్ళకి చేతకాదు. నువ్వు చేసుకోగలవు,” అన్నారాయన. ఇది నాకు మొదటిపాఠం నాగురించి నాకు నేను ఆలోచించుకునే విషయంలో. అలాగే మాఅమ్మ కూడా. ఒకసారి ఎవరో, “అమ్మాయిని శ్రద్ధగా చదువుకోమని చెప్పండి,” అంటే, అమ్మ, “నేను చెప్పఖ్ఖర్లేదు. దానికి తెలీదేమిటి,” అనడం విన్నాను. నా యూనివర్సిటీ చదువు అయిపోయేక, నేను విజయనగరం విమెన్స్ కాలేజీలో లైబ్రేరియన్ గా ఒక సంవత్సరం పని చేసేను. అక్కడ ఇద్దరు లెక్చరర్లు, రేణుక, సీతారామమ్మ, నేనూ మంచి స్నేహితులం అయిపోయేం. ముగ్గురం కలిసి మెలిసి తిరుగుతూండేవాళ్ళం. ఒకసారి రేణుకకి భువనేశ్వరంలో ఇంటర్వ్యూ

ఏం చేస్తున్నావమ్మా అక్కడ?

 " ఏం చేస్తున్నావమ్మా అక్కడ? మట్టిలో ఆడుతున్నావా? " అడిగేను మా పదేళ్ళ పాపను. " లేదమ్మా. కాలి మీద చీమ కుడుతుంది తీసి పారేస్తున్నాను" " అయ్యయ్యో. చీమ కుడుతుంటే అంత సున్నితంగా తీస్తే వస్తుందా తల్లీ ? నలిపి పారేయాలి గాని ఏదీ ఇలా రా " అన్నాను " వచ్చేసిందిలే అమ్మా. నలిపి పారేస్తే పాపం చీమ చచ్చిపోదూ? జీవహింస చేయడం మహా పాపమట కదా? " కళ్ళు చక్రాల్లా త్రిప్పుతూ అంది. "ఎవరు చేప్పేరమ్మా నీకు? " కుతూహలంగా ప్రశ్నించేను. "ఈవేళ మా టీచర్ అహింసా పరమో ధర్మః అనే పాఠం చెప్పేరు. దేన్నీ హింసించకుండా ఉండడమే అన్ని ధర్మాలలోకీ గొప్పదట. అదే మానవ ధర్మం కూడానట. చూడమ్మా. కుట్టడం చీమ లక్షణం. అది చచ్చిపోయేటప్పుడు కూడా తన లక్షణాన్ని విడిచిపెట్టడంలేదు.అలాంటప్పుడు మనం మన ధర్మాన్ని ఎందుకు విడిచిపెట్టాలి? దాన్ని హింసించక పోవడమే మన ధర్మం" అంది ఓ ఉపదేశకురాలిలా. " చిన్నదానివైనా ఎంత చక్కగా చెప్పెవమ్మా. అలవాటు ప్రకారం స్కూల్ లో చెప్పిన పాఠం నీ మనసులో ఎంతగా హత్తుకుపోయిందో. పెద్దవాళ్ళ మైనా మేము అంతగా పట్టించుకోలేదు. ఏడీ? మీ అన్నయ్య ఏడీ? ఆ రౌడీ వెధవను ఇలా రమ్మను. వాడి