ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మనసు కృపను పొందలేక పోతే ... వామ్మో

జీవితం బహు చిత్రమైనది. ఒడుదొడుకులు, ఆరాటం, పోరాటం మనిషి మనసును మధించి అశాంతికి గురిచేస్తాయి. గెలుపు, ఓటములు, కష్టసుఖాలు ఉంటాయి. మనసును సమాధానపరచుకొని ముందుకు సాగాలి. సాధారణంగా ఆటల్లో నెగ్గినవారిని, పాటల్లో గెలిచినవారిని విజేతలంటారు. కంటికి కనిపించకుండా మనల్ని ఆడిస్తుంది మనసు. దాని ఆట కట్టించగలిగితేనే మనిషి విజయం సాధించినట్లు!

మనసును అదుపులో పెట్టడం అంత సులభం కాదు. దానికి తగిన సాధన చెయ్యాలి. మనసును జయించడానికి ముందు ఇంద్రియ నిగ్రహం అలవరచుకోవాలి. మనసును మన చెప్పుచేతల్లో ఉంచుకోవాలి. అంతేకాని, దాని చేతుల్లో కీలుబొమ్మ కారాదు. అభ్యాస వైరాగ్యాల ద్వారా మనసును స్వాధీనం చేసుకోవచ్చని గీతాచార్యులు వెల్లడించారు.

‘దేవుడి కృపను పొందవచ్చు. గురువు కృపను, సాధుజనుల కృపను పొందవచ్చు. కాని మనసు కృపను పొందలేక నాశనమవుతాడు’ అని సామెత ఉంది. ‘వెయ్యిసార్లు వెయ్యిమందిని యుద్ధంలో ఓడించిన వాడికన్నా తన మనసును జయించినవాడే పరాక్రమవంతుడు’ అంటుంది ధమ్మపద. మనసును స్వాధీనం చేసుకోవడం ప్రపంచంలో అన్నింటికన్నా కష్టమైన పని. స్వాధీనం తప్పిన మనసు మనిషి వ్యక్తిత్వం సమగ్రంగా వికసించకుండా అడ్డుపడుతుంది. మనోనిగ్రహం లేని వ్యక్తి విపరీతమైన పోకడలకు, ఎడతెరిపి లేని అంతర్మథనం వల్ల కలిగే మానసిక పతనానికి గురవుతాడు.

ఈ స్థూల శరీరంలో మనసు ఒక సూక్ష్మమైన భాగం మాత్రమే. భౌతికమైన స్థూల శరీరం మనసుకు పైన ఒక పొర. మనసు వెనక ఆత్మ ఉంది. మనసు సర్వ స్వతంత్రమైనది కాకపోయినా, దానికున్న శక్తులు అపారమైనవి. ఆ శక్తులను జయించడానికి మనిషి విశ్వప్రయత్నం చేయాలి. అప్పుడే అతడు విజేత కాగలడు. మనసెప్పుడూ ఒకేలా ఉండదు. మూడు బలమైన శక్తుల కలయికే దానికి కారణం. అవి సత్వం, రజస్సు, తమస్సు అనేవి.

శ్రీ రామకృష్ణ ‘పరిశుద్ధమైన మనసే పరిశుద్ధమైన బుద్ధి. అదే పరిశుద్ధమైన ఆత్మ’ అన్నారు. మనసు నాలుగు విధాలైన విధులను కలిగి ఉంటుంది. అవి: మది, బుద్ధి, అహంకారం, చిత్తం. ఇవన్నీ అంతఃకరణ తాలూకు వేర్వేరు రూపాంతరాలు. ‘మది’ ఒక వస్తువు. మంచి చెడులను అంచనా వేస్తుంది. ‘బుద్ధి’ మంచి చెడులను నిర్ణయిస్తుంది. చిత్తం జ్ఞాపకశక్తిని కలిగిస్తుంది. ‘నేను’ అనే భావాన్ని కలిగించేది ‘అహంకారం’. మనసును స్వాధీనం చేసుకోవాలంటే అది పవిత్రంగా ఉండాలి. మనం తినే ఆహారం పరిశుద్ధంగా ఉంటే మనసు పవిత్రమవుతుంది.

మనసును గెలవాలనుకునేవారు తమ కలతలు, కక్షలు, స్పర్థలు లోలోపలే దాచుకోరాదు. మనసుకు సృజనాత్మకమైన, ఆరోగ్యకరమైన కాలక్షేపం కల్పించాలి. శ్రీమద్భాగవతం ‘దానం, కర్తవ్య నిష్ఠ, వ్రతాలు, పురాణ శ్రవణం, పుణ్యకర్మలు ఇత్యాది పనులు మనసును స్వాధీనపరచుకోవడానికి దోహదం చేస్తాయి’ అని చెబుతోంది. ముఖ్యంగా భగవంతుడి గురించి ధ్యానం చేయాలి. గాయత్రీ మంత్రాన్ని అనునిత్యం జపిస్తే, మనసు మీ ఆధీనంలోనికి రావడానికి తోడ్పడుతుంది. పతంజలి ఓంకారాన్ని జపించడం ద్వారా మనసును స్వాధీనం చేసుకోవచ్చని సూచించారు.

‘వివేక చూడామణి’లో శంకరాచార్యులు ‘మెట్లపై నుంచి జారవిడిచిన బంతి ఏ విధంగా ఒక్కొక్క మెట్టుమీద నుంచి దొర్లుతూ కిందికి పడిపోతుందో అలాగే, మనసు తన ఆదర్శం నుంచి ఏ కొంచెం పక్కకు తప్పుకొని భోగవస్తువుల మీదకు  మరలినా క్రమక్రమంగా అది మరీ హీనస్థితికి జారిపోతుంది’ అన్నారు. మన సంకల్ప శక్తితో మనసు మీద పట్టు సాధించి నిలకడగా భగవంతుని ధ్యానించేటట్టు చెయ్యాలి. మనసును సుశిక్షితుడైన సైనికుడిలా మలచి మాట వినేలా చేయగలిగినవాడే విజేతగా విలసిల్లుతాడు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ..

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు శ్రీ ఎస్.ఆర్ రంగనాథన్ గారి జయంతి ఈరోజు ఆసందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ.... జననం 12 ఆగష్టు 1892 మరణం 27 సెప్టెంబరు1972 గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి, గ్రంథాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన గణిత శాస్త్రవేత్త షియాలి రామామృత రంగనాథన్ గారు ఆగస్టు 12వ తేదిన 1892 తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని షియాలీ అనే గ్రామంలో జన్మించారు. దాదాపు రోజుకు 10–15 గంటలకు పైగా పనిచేస్తూ, వారానికి ఒక్క రోజైనా సెలవు తీసుకోకుండా నిరంతరాయంగా రంగనాథన్ గ్రంథపాలక వృత్తే దైవంగా, పనే జీవితంగా గడిపిన నిర్మలకర్మయోగి. ఆధునిక వైజ్ఞానిక సాంకేతిక రంగాలలో పెను మార్పులు చోటుచేసుకున్న ఈసమయంలో కూడా గ్రంథాలయాల ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుందని ఆనాడే గుర్తించి, గ్రంథాలయాలకు ఒక శాస్త్రాన్ని ప్రవేశపెట్టి, ప్రజలకు విజ్ఞానాన్ని పంచే ప్రజా విశ్వవిద్యాలయాల అని పిలువబడే పౌర గ్రంథాలయాలుకు రూపకల్పన చేశారు. నేడు ఈ ప్రజా విశ్వవిద్యాలయాలకు ప్రజల నుండి ఆదరణ ఉందంటే అది రంగనాథన్ చేసిన కృషి వల్లనే అన్నది నగ్న సత్యం. 1924 సంవత్సరంలో మద్రాస్ విశ్వవిద్యాలయం గ్రంథపాలకునిగా ఆయన నియమితులయ్యారు.. కొద్ది కాలం పాటు ఇంగ్లాండ్ పర్

ఆత్మవిశ్వాసం ఎలా వస్తుందంటే

  ఆత్మవిశ్వాసం అంటే నాలో నాకు నమ్మకం కలిగించిన సన్నివేశాలు మూడో నాలుగో ఉన్నాయి నాకు జ్ఞాపకం ఉన్నవి. చెప్పేను కదా మాఇంట్లో ఎదురుపడి మాట్లాడుకోడం తక్కువే అని. నువ్వు ఆడపిల్లవి ఇలా ఉండాలి, ఇలా చెయ్యి, అలా చెయ్యకూడదు అంటూ ఎప్పుడూ ఏ ఆంక్షలూ లేవు. నీతిపాఠాలు అసలే లేవు. హైస్కూలు రోజుల్లో పరీక్షఫీజు కట్టడానికి నాన్నగారు విద్యార్థులని స్కూలు ఆపీసుకి తీసుకెళ్లేరు. ఆ తరవాత నాకు డబ్బు ఇచ్చి, “వెళ్లి ఫీజు కట్టి రా,” అన్నారు. నాకు కోపం వచ్చింది. “వాళ్ళతో వెళ్లేరు కదా, నాతో ఎందుకు రారూ?” అని అడిగేను. “వాళ్ళకి చేతకాదు. నువ్వు చేసుకోగలవు,” అన్నారాయన. ఇది నాకు మొదటిపాఠం నాగురించి నాకు నేను ఆలోచించుకునే విషయంలో. అలాగే మాఅమ్మ కూడా. ఒకసారి ఎవరో, “అమ్మాయిని శ్రద్ధగా చదువుకోమని చెప్పండి,” అంటే, అమ్మ, “నేను చెప్పఖ్ఖర్లేదు. దానికి తెలీదేమిటి,” అనడం విన్నాను. నా యూనివర్సిటీ చదువు అయిపోయేక, నేను విజయనగరం విమెన్స్ కాలేజీలో లైబ్రేరియన్ గా ఒక సంవత్సరం పని చేసేను. అక్కడ ఇద్దరు లెక్చరర్లు, రేణుక, సీతారామమ్మ, నేనూ మంచి స్నేహితులం అయిపోయేం. ముగ్గురం కలిసి మెలిసి తిరుగుతూండేవాళ్ళం. ఒకసారి రేణుకకి భువనేశ్వరంలో ఇంటర్వ్యూ

ఏం చేస్తున్నావమ్మా అక్కడ?

 " ఏం చేస్తున్నావమ్మా అక్కడ? మట్టిలో ఆడుతున్నావా? " అడిగేను మా పదేళ్ళ పాపను. " లేదమ్మా. కాలి మీద చీమ కుడుతుంది తీసి పారేస్తున్నాను" " అయ్యయ్యో. చీమ కుడుతుంటే అంత సున్నితంగా తీస్తే వస్తుందా తల్లీ ? నలిపి పారేయాలి గాని ఏదీ ఇలా రా " అన్నాను " వచ్చేసిందిలే అమ్మా. నలిపి పారేస్తే పాపం చీమ చచ్చిపోదూ? జీవహింస చేయడం మహా పాపమట కదా? " కళ్ళు చక్రాల్లా త్రిప్పుతూ అంది. "ఎవరు చేప్పేరమ్మా నీకు? " కుతూహలంగా ప్రశ్నించేను. "ఈవేళ మా టీచర్ అహింసా పరమో ధర్మః అనే పాఠం చెప్పేరు. దేన్నీ హింసించకుండా ఉండడమే అన్ని ధర్మాలలోకీ గొప్పదట. అదే మానవ ధర్మం కూడానట. చూడమ్మా. కుట్టడం చీమ లక్షణం. అది చచ్చిపోయేటప్పుడు కూడా తన లక్షణాన్ని విడిచిపెట్టడంలేదు.అలాంటప్పుడు మనం మన ధర్మాన్ని ఎందుకు విడిచిపెట్టాలి? దాన్ని హింసించక పోవడమే మన ధర్మం" అంది ఓ ఉపదేశకురాలిలా. " చిన్నదానివైనా ఎంత చక్కగా చెప్పెవమ్మా. అలవాటు ప్రకారం స్కూల్ లో చెప్పిన పాఠం నీ మనసులో ఎంతగా హత్తుకుపోయిందో. పెద్దవాళ్ళ మైనా మేము అంతగా పట్టించుకోలేదు. ఏడీ? మీ అన్నయ్య ఏడీ? ఆ రౌడీ వెధవను ఇలా రమ్మను. వాడి