ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బహుశా జీవితమంటే ఇదేనేమో.

 


తము నెరవేర్చుకోలేనివి తమ పిల్లల ద్వారా నిజం చేయాలనుకుంటారు పేరెంట్స్‌. 

ఇంటర్‌ తర్వాత నాకూ అలాంటి పరిస్థితే ఎదురైంది. ఎంసెట్‌లో మంచి ర్యాంకు రావడంతో నాన్న నన్ను ఇంజినీరింగ్‌లో చేర్పించారు. నాకు ఇష్టం లేకపోయినా నాన్న ఆనందం కోసం ఒప్పుకొన్నా.

 2012 సెప్టెంబర్‌లో నా క్యాంపస్‌ జర్నీ మొదలైంది. చదువుతో పాటు వివిధ రకాల మనుషులు వారి మనస్తత్వాలు తెలుసుకుంటూ ఆ లైఫ్‌కి అలవాటు పడుతున్నా. 

ఓ రోజు తీవ్రమైన అనారోగ్యంతో ఇంటికి వెళ్లాల్సివచ్చింది. తీసుకు వెళ్లేందుకు బైక్‌పై నాన్న వచ్చారు. ఇంటికెళ్లే దార్లో యాక్సిడెంట్‌. స్పృహలోకి వచ్చేసరికి నేనొకచోట.. నాన్నొకచోట.. రోడ్డు మీద పడిఉన్నాం.. అదంతా అటవీ ప్రాôతం కావడంతో బంధువుల సాయంతో హాస్పిటల్‌కు చేరుకున్నాం. నెలలు గడిచాయి. నాన్న ఆరోగ్యం కుదుటపడింది. 

నేను మాత్రం జరిగిన ప్రమాదం నుంచి తేరుకోలేకపోయాను. మమ్మల్ని పలకరించడానికి బంధువులు, స్నేహితులు వచ్చి వెళ్లేవారు. వాళ్లలో ఒకావిడలో ఏదో ఎనర్జీ చూశా. చాలా ఉత్సాహంగా కనిపించారు. నాకెందుకో చాలా రిఫ్రెషింగ్‌గా అనిపించింది.

ఎదురుగా కూర్చున్న తన కొడుకుని చూపించి నవ్వింది. విచిత్రమేమిటంటే అతనూ నాలాగే కట్టుకట్టుకుని కూర్చున్నాడు. అతడు కూడా వాళ్ల అమ్మలానే నవ్వుతూ హాయ్‌ చెప్పాడు. నా ముఖంలో ఇంజినీరింగ్‌పై అనాసక్తిని గమనించాడేమో. చదువు తప్ప అన్ని విషయాల గురించి మాట్లాడాడు. ఎందుకో.. తన మాటల్లో నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. నాలాగే ఆలోచిస్తున్నట్టుగా తోచింది. 

ఇలా ఆలోచిస్తుండగా.. ‘ఈ ఏడాది చివర్లో అమెరికాకి వెళ్తున్నా. మాస్టర్స్‌ చేయడానికి..’ అన్నాడు. ఆశ్చర్యంగా అతడివైపు చూశాను. ‘కేవలం చదువు కోసమే. ఎలక్ట్రానిక్స్‌ గురించి రిసర్చ్‌ చేయడానికి’ అంటూ.. నాకు తెలియని అంశాలను ఆసక్తికరంగా వివరించాడు. తను చెబుతుంటే.. అప్పటి వరకూ నాకు తెలియని నన్ను  చూశాను.

మెల్లగా ప్రమాదం నుంచి తేరుకున్నాను. మళ్లీ ఫ్రెష్‌గా కళాశాలలో అడుగుపెట్టాను. నేర్చుకునే ప్రతీ అంశాన్నీ నిజజీవితానికి ముడేసి చూడడం అలవాటు అయ్యింది. అలా రెండేళ్లు గడిచాయి. కానీ, ఏదో అసంతృప్తి. ఇష్టపడే చదువుతున్నా.. కానీ నా లక్ష్యం ఏంటి? అనే ఆలోచన మొదలైంది. 

ఒక రోజు అప్పుడే కాలేజీ నుంచి ఇంటికి వచ్చా.. అదే రోజు మమ్మల్ని పలకరించడానికి వచ్చిన ఆంటీ కనిపించారు. నా క్షేమసమాచారాలు అడుగుతూనే ‘మరో మూడు నెలల్లో మా అబ్బాయి అమెరికా నుంచి వస్తున్నాడు’ అంది. ఆ మాటతో నాలో అలజడి. రెండేళ్లలో నేను అతనితో ఎన్నడూ మాట్లాడింది లేదు. అయినా.. అతని ఆలోచనలే. అతని కుటుంబ సభ్యుల్లాగే నేను కూడా అతడి రాకకోసం ఎదురుచూస్తున్నాను.

ఎప్పటిలానే ఆ రోజూ స్నేహితులతో కబుర్లు చెబుతూ.. ఇంటికి చేరుకున్నాను. ఇంట్లో అందరూ డల్‌గా ఉండటం చూసి ఏం జరిగిందని అడిగా. ఎవరి నుంచీ సమాధానం లేదు. కొన్ని గంటల తర్వాత విషయం తెలిసింది. నిన్న రాత్రి అమెరికాలో ఆంటీ వాళ్ల అబ్బాయి కారు ప్రమాదంలో చనిపోయాడని. ఒక్కసారిగా ఏం చెప్పారో.. నా చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కొన్ని రోజుల్లో వస్తాడన్న వ్యక్తి కనిపించడు.. రాడు అన్న విషయం జీర్ణించుకోలేకపోయాను. అతడి మాటలే నిత్యం గుర్తొచ్చేవి..! నాతో అతడు మాట్లాడింది.. రోజులో కొన్ని గంటలే కానీ అవి చెరగని ముద్ర వేశాయి.

 అతని ఆలోచనలతో చదువు ముందుకు సాగేది కాదు. ఎందుకంటే నాకు ఇంజినీరింగ్‌ చదువుపైన ఆసక్తి కలిగించేలా చేసింది అతడే. తనే లేకపోవడం బాధించింది. వచ్చిన సబ్జెక్ట్‌ అయినా పరీక్ష గదిలోకి వెళ్లాక ఖాళీ పేపరు ఇచ్చి వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. 

ఒకరోజు అద్దంలో నన్ను నేను బాగా ప్రశ్నించుకున్నా. అప్పుడు నిశ్చయించుకున్నా. 

నా డిగ్రీని అతనికి కానుకగా ఇవ్వాలని కష్టపడ్డాను. 

అవగాహన లేని విషయాలపై పట్టుసాధించి మళ్లీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాను. 

నా కాన్వకేషన్‌ డిగ్రీ ప్రదానోత్సవంలో అందరం విడిపోతున్నందుకు బాధ పడుతుంటే.. నాకు మాత్రం అతడి ఆశయం నెరవేర్చినందుకు ఆనందభాష్పాలు వచ్చాయి.

అతడిని తలుచుకుంటూ బాధపడేకంటే నేను చేసే ప్రతి పనిలో తనే ఉన్నాడనుకుని ముందుకు సాగుతున్నా. 


Credits: Telegram User Sudhakar

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ..

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు శ్రీ ఎస్.ఆర్ రంగనాథన్ గారి జయంతి ఈరోజు ఆసందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ.... జననం 12 ఆగష్టు 1892 మరణం 27 సెప్టెంబరు1972 గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి, గ్రంథాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన గణిత శాస్త్రవేత్త షియాలి రామామృత రంగనాథన్ గారు ఆగస్టు 12వ తేదిన 1892 తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని షియాలీ అనే గ్రామంలో జన్మించారు. దాదాపు రోజుకు 10–15 గంటలకు పైగా పనిచేస్తూ, వారానికి ఒక్క రోజైనా సెలవు తీసుకోకుండా నిరంతరాయంగా రంగనాథన్ గ్రంథపాలక వృత్తే దైవంగా, పనే జీవితంగా గడిపిన నిర్మలకర్మయోగి. ఆధునిక వైజ్ఞానిక సాంకేతిక రంగాలలో పెను మార్పులు చోటుచేసుకున్న ఈసమయంలో కూడా గ్రంథాలయాల ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుందని ఆనాడే గుర్తించి, గ్రంథాలయాలకు ఒక శాస్త్రాన్ని ప్రవేశపెట్టి, ప్రజలకు విజ్ఞానాన్ని పంచే ప్రజా విశ్వవిద్యాలయాల అని పిలువబడే పౌర గ్రంథాలయాలుకు రూపకల్పన చేశారు. నేడు ఈ ప్రజా విశ్వవిద్యాలయాలకు ప్రజల నుండి ఆదరణ ఉందంటే అది రంగనాథన్ చేసిన కృషి వల్లనే అన్నది నగ్న సత్యం. 1924 సంవత్సరంలో మద్రాస్ విశ్వవిద్యాలయం గ్రంథపాలకునిగా ఆయన నియమితులయ్యారు.. కొద్ది కాలం పాటు ఇంగ్లాండ్ పర్

ఆత్మవిశ్వాసం ఎలా వస్తుందంటే

  ఆత్మవిశ్వాసం అంటే నాలో నాకు నమ్మకం కలిగించిన సన్నివేశాలు మూడో నాలుగో ఉన్నాయి నాకు జ్ఞాపకం ఉన్నవి. చెప్పేను కదా మాఇంట్లో ఎదురుపడి మాట్లాడుకోడం తక్కువే అని. నువ్వు ఆడపిల్లవి ఇలా ఉండాలి, ఇలా చెయ్యి, అలా చెయ్యకూడదు అంటూ ఎప్పుడూ ఏ ఆంక్షలూ లేవు. నీతిపాఠాలు అసలే లేవు. హైస్కూలు రోజుల్లో పరీక్షఫీజు కట్టడానికి నాన్నగారు విద్యార్థులని స్కూలు ఆపీసుకి తీసుకెళ్లేరు. ఆ తరవాత నాకు డబ్బు ఇచ్చి, “వెళ్లి ఫీజు కట్టి రా,” అన్నారు. నాకు కోపం వచ్చింది. “వాళ్ళతో వెళ్లేరు కదా, నాతో ఎందుకు రారూ?” అని అడిగేను. “వాళ్ళకి చేతకాదు. నువ్వు చేసుకోగలవు,” అన్నారాయన. ఇది నాకు మొదటిపాఠం నాగురించి నాకు నేను ఆలోచించుకునే విషయంలో. అలాగే మాఅమ్మ కూడా. ఒకసారి ఎవరో, “అమ్మాయిని శ్రద్ధగా చదువుకోమని చెప్పండి,” అంటే, అమ్మ, “నేను చెప్పఖ్ఖర్లేదు. దానికి తెలీదేమిటి,” అనడం విన్నాను. నా యూనివర్సిటీ చదువు అయిపోయేక, నేను విజయనగరం విమెన్స్ కాలేజీలో లైబ్రేరియన్ గా ఒక సంవత్సరం పని చేసేను. అక్కడ ఇద్దరు లెక్చరర్లు, రేణుక, సీతారామమ్మ, నేనూ మంచి స్నేహితులం అయిపోయేం. ముగ్గురం కలిసి మెలిసి తిరుగుతూండేవాళ్ళం. ఒకసారి రేణుకకి భువనేశ్వరంలో ఇంటర్వ్యూ

ఏం చేస్తున్నావమ్మా అక్కడ?

 " ఏం చేస్తున్నావమ్మా అక్కడ? మట్టిలో ఆడుతున్నావా? " అడిగేను మా పదేళ్ళ పాపను. " లేదమ్మా. కాలి మీద చీమ కుడుతుంది తీసి పారేస్తున్నాను" " అయ్యయ్యో. చీమ కుడుతుంటే అంత సున్నితంగా తీస్తే వస్తుందా తల్లీ ? నలిపి పారేయాలి గాని ఏదీ ఇలా రా " అన్నాను " వచ్చేసిందిలే అమ్మా. నలిపి పారేస్తే పాపం చీమ చచ్చిపోదూ? జీవహింస చేయడం మహా పాపమట కదా? " కళ్ళు చక్రాల్లా త్రిప్పుతూ అంది. "ఎవరు చేప్పేరమ్మా నీకు? " కుతూహలంగా ప్రశ్నించేను. "ఈవేళ మా టీచర్ అహింసా పరమో ధర్మః అనే పాఠం చెప్పేరు. దేన్నీ హింసించకుండా ఉండడమే అన్ని ధర్మాలలోకీ గొప్పదట. అదే మానవ ధర్మం కూడానట. చూడమ్మా. కుట్టడం చీమ లక్షణం. అది చచ్చిపోయేటప్పుడు కూడా తన లక్షణాన్ని విడిచిపెట్టడంలేదు.అలాంటప్పుడు మనం మన ధర్మాన్ని ఎందుకు విడిచిపెట్టాలి? దాన్ని హింసించక పోవడమే మన ధర్మం" అంది ఓ ఉపదేశకురాలిలా. " చిన్నదానివైనా ఎంత చక్కగా చెప్పెవమ్మా. అలవాటు ప్రకారం స్కూల్ లో చెప్పిన పాఠం నీ మనసులో ఎంతగా హత్తుకుపోయిందో. పెద్దవాళ్ళ మైనా మేము అంతగా పట్టించుకోలేదు. ఏడీ? మీ అన్నయ్య ఏడీ? ఆ రౌడీ వెధవను ఇలా రమ్మను. వాడి