ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఇంగ్లీషువాడు .. వాడి భాష మనకి రాదు...


ఇంగ్లీషువాడు సప్తసముద్రాలు దాటి వచ్చేశాడు.

ముందు వ్యాపారం చేయడానికి... తరువాత అధికారం చెలాయించడానికి....

వాడి భాష మనకి రాదు...

వాడు "గాడ్ ఈజ్ గుడ్" అనేవాడు.

మనకి అది "గాడిదగుడ్డు" గా అర్థమైంది.

మనం "రాజమహేంద్రి" అన్నాం...

వాడికి "రాజమండ్రి"లా వినిపించింది.

మన మాట వాడికి అర్ధమయ్యేది కాదు... వాడి భాష మనకి బోధపడేది కాదు.

వ్యాపారం, పరిపాలన వాళ్ల అవసరం కనుక తెల్ల అధికారులు ఒక్కొక్కరూ తెలుగు పదాలను పట్టుకున్నారు. డిక్షనరీలు తయారు చేశారు. 1818లో విలియం బ్రౌన్ తొలి తెలుగు - ఇంగ్లీషు డిక్షనరీ తయారుచేశాడు. 1821లో క్యాంప్ బెల్ ఇలాంటిదే ఇంకో నిఘంటువు తయారుచేశాడు. మన మాటలు వాడికి అర్థమయ్యాయి. కానీ వాడి మాటలు మనకి అర్ధం కావాలి కదా. అవసరం వాడిది. అందుకే జాన్ కార్నిక్ మారిస్ అనే వాడు ఇంగ్లీషు తెలుగు డిక్షనరీ తయారు చేశాడు. ఆ తరువాత సీ.పీ. బ్రౌన్ దొర ఇంకో డిక్షనరీ 1852 లో (ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి సరిగ్గా అయిదేళ్ల ముందు) తయారు చేశాడు.

చాలా మంది తెల్ల అధికారులు దుబాషీలను పెట్టుకున్నారు. దుబాషీలంటే ద్విభాషీలు. అటుది ఇటు ఇటుది అటు వివరించి చెప్పగలవారు వీరు. కానీ అందరికీ అంత దృశ్యం ఉండేది కాదు. వీళ్లు ముక్కస్యముక్కానువాదం చేసేవారు.

గుడిమెట్ల బంగారయ్య అంటే .....  Temple steps golden father అని..

పత్తికొండ నాగప్ప అంటే  cotton mountain cobra father అని 

తోటకూర అంటే Garden to come  అనీ చిత్ర విచిత్రంగా అను"వధించే" వారు.

అలాంటి సమయంలో తెల్లోడి భాషను తెల్లోడి కన్నా తేటతెల్లంగా నేర్చుకుని, ధారాళంగా మాట్లాడేయడం అంటే మాటలు కాదు. ఇంకా ఇంగ్లండుకు పోయి ఉన్నత విద్య నేర్చుకోవడం వంటివి అలవాటు కాలేదు. అలాంటి రోజుల్లో తెల్లోడే తెల్లబోయేలా ఇంగ్లీషు మాట్లాడే వాడికి బోలెడంత డిమాండ్ ఉండేది.

అలాంటి వాడే మన నాయకుడు. ఆయన పేరు పావులూరి శంకరనారాయణ శ్రేష్ఠి. సొంతూరు నెల్లూరు. కానీ మద్రాసులో స్థిరపడ్డారు. తండ్రి రామానుజం చెట్టి నుంచి ఇంగ్లీషు నేర్చుకున్నారు. తండ్రిలాగానే దుబాషీ అయ్యారు. తండ్రి గంజాంలో రస్సెల్ అనే తెల్లదొరకు దుబాషీగా పనిచేసేవాడు. ఈయన విజయనగరం మహారాజా, జయపురం మహారాజా, పిఠాపురం, కొచ్చి, నూజివీడు జమీందారీ కుటుంబాల పిల్లలకు ఇంగ్లీషు చదువులు చెప్పారు. ఆ తరువాత మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో లెక్కల మేస్టారుగా పనిచేశారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో పరీక్షాధికారిగా కూడా పనిచేశారు. అంటే తన జీవిత కాలంలో ఆయన తమిళనాడు రాజధాని మద్రాసు, ఒరిస్సాలోని గంజాం, జయపురం, మన రాష్ట్రంలోని విజయనగరం, పిఠాపురం, నూజివీడు, నెల్లూరు, కేరళలోని కొచ్చి లను సందర్శించాడన్న మాట. ఆ రోజుల్లోనే ఆయన ఉద్యోగాల కోసం ఊరు వదలిన మహాసాహసి అంటే అడ్వెంచరర్ అన్న మాట.

రాచబిడ్డలకు చదువులు చెబుతున్నప్పుడే ఆయన వారి సౌలభ్యం కోసం ఇంగ్లీషు పదాలు, వాటి తెలుగు అర్థాల జాబితాను తయారు చేశారు. తరువాత దాన్నే వ్యవస్థీకరించి తెలుగువాడు తయారు చేసిన తొలి ఇంగ్లీషు తెలుగు డిక్షనరీని తయారు చేశారు. అంతే కాదు ... ఆయన తమిళ - ఇంగ్లీషు, ఇంగ్లీషు - తమిళ డిక్షనరీలను కూడా తయారు చేశారు. 1900 ప్రాంతంలో తెలుగు - ఇంగ్లీషు డిక్షనరీ కూడా తయారు చేశారు.

తన అవసరం కోసం ఇంగ్లీషు వాడు తయారు చేసినవి కాకుండా మన అవసరం కోసం మనవాడు తయారుచేసిన మొట్టమొదటి డిక్షనరీలు ఇవేనేమో!

ఆయన తయారుచేసిన తెలుగు డిక్షనరీ 1897లో ప్రచురితమైంది. దాని పేరే శంకరనారాయణ డిక్షనరీ. అప్పటి నుంచీ ఇంగ్లీషు నేర్చుకోవాలనుకున్న వారందరికీ శంకరనారాయణ డిక్షనరీయే ఆధారమైంది. అందరికీ ఆధునిక వేదమైంది. ఆయన బతికుండగానే అయిదు ముద్రణలకు నోచుకుంది. ప్రతి ముద్రణకీ కొత్త పదాలు జోడయ్యాయి. ఆయన 1924-25 ప్రాంతంలో చనిపోయారు. ఆ తరువాత 1927 లో గిడుగు సీతాపతి గారు, 1951 లో చిలుకూరి నారాయణ రావు గారు, తరువాత వేదం లక్ష్మీనారాయణ గారు కొత్తకొత్త పదాలను జోడించారు. 1953 లో నారాయణ అయ్యర్ దీనిని పరిష్కరించారు. ఇలా 1897 నుంచి 1953 వరకూ పదకొండు సార్లు పునర్ముద్రణ పొందింది ఈ డిక్షనరీ. కోస్తా జిల్లాల్లో ఇప్పటికీ ఈ డిక్షనరీయే ప్రామాణికం. తరతరాల విద్యార్థులకు ఇది హస్త భూషణంగా నిలిచింది. అనుమానం వస్తే చాలు ఆ పుస్తకం తీస్తారు. అంత ప్రజాదరణ ఉంది ఈ డిక్షనరీకి. 2004 అక్టోబర్లో విజయవాడకు చెందిన విక్టరీ పబ్లిషర్స్ దీన్ని మళ్లీ ముద్రించారు. ఆగస్టు 2005 నాటికి మలి ముద్రణ అవసరమైంది. మళ్లీ 2006, 2007లలో పునర్ముద్రించాల్సి వచ్చింది. ఈ నిఘంటువు ప్రజాదరణకు ఇదే నిదర్శనం.

కోస్తా, తమిళనాడుల్లో ఆంగ్ల భాష నేర్చుకోవడంలో ఆయన పాత్ర అనన్యసామాన్యం. ఆయన పేరుతోనే ఆయన వ్రాసిన డిక్షనరీ పేరొందింది. ఇప్పటికీ శంకరనారాయణ డిక్షనరీ అంటే ప్రామాణికమే.

పావులూరి శంకరనారాయణ శ్రేష్ఠి ఇప్పుడు లేరు. ఆయన పోయి దాదాపు తొంభై ఏళ్లు దాటింది. కానీ లక్షలాది మంది విద్యార్థులు ఆంగ్ల పదం విషయంలో అనుమానం రాగానే "శంకరనారాయణను తీసి చూడు" అనుకుంటూ అప్రయత్నంగానే ఆయనను తలచుకుంటూనే ఉంటారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ..

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు శ్రీ ఎస్.ఆర్ రంగనాథన్ గారి జయంతి ఈరోజు ఆసందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ.... జననం 12 ఆగష్టు 1892 మరణం 27 సెప్టెంబరు1972 గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి, గ్రంథాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన గణిత శాస్త్రవేత్త షియాలి రామామృత రంగనాథన్ గారు ఆగస్టు 12వ తేదిన 1892 తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని షియాలీ అనే గ్రామంలో జన్మించారు. దాదాపు రోజుకు 10–15 గంటలకు పైగా పనిచేస్తూ, వారానికి ఒక్క రోజైనా సెలవు తీసుకోకుండా నిరంతరాయంగా రంగనాథన్ గ్రంథపాలక వృత్తే దైవంగా, పనే జీవితంగా గడిపిన నిర్మలకర్మయోగి. ఆధునిక వైజ్ఞానిక సాంకేతిక రంగాలలో పెను మార్పులు చోటుచేసుకున్న ఈసమయంలో కూడా గ్రంథాలయాల ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుందని ఆనాడే గుర్తించి, గ్రంథాలయాలకు ఒక శాస్త్రాన్ని ప్రవేశపెట్టి, ప్రజలకు విజ్ఞానాన్ని పంచే ప్రజా విశ్వవిద్యాలయాల అని పిలువబడే పౌర గ్రంథాలయాలుకు రూపకల్పన చేశారు. నేడు ఈ ప్రజా విశ్వవిద్యాలయాలకు ప్రజల నుండి ఆదరణ ఉందంటే అది రంగనాథన్ చేసిన కృషి వల్లనే అన్నది నగ్న సత్యం. 1924 సంవత్సరంలో మద్రాస్ విశ్వవిద్యాలయం గ్రంథపాలకునిగా ఆయన నియమితులయ్యారు.. కొద్ది కాలం పాటు ఇంగ్లాండ్ పర్

ఆత్మవిశ్వాసం ఎలా వస్తుందంటే

  ఆత్మవిశ్వాసం అంటే నాలో నాకు నమ్మకం కలిగించిన సన్నివేశాలు మూడో నాలుగో ఉన్నాయి నాకు జ్ఞాపకం ఉన్నవి. చెప్పేను కదా మాఇంట్లో ఎదురుపడి మాట్లాడుకోడం తక్కువే అని. నువ్వు ఆడపిల్లవి ఇలా ఉండాలి, ఇలా చెయ్యి, అలా చెయ్యకూడదు అంటూ ఎప్పుడూ ఏ ఆంక్షలూ లేవు. నీతిపాఠాలు అసలే లేవు. హైస్కూలు రోజుల్లో పరీక్షఫీజు కట్టడానికి నాన్నగారు విద్యార్థులని స్కూలు ఆపీసుకి తీసుకెళ్లేరు. ఆ తరవాత నాకు డబ్బు ఇచ్చి, “వెళ్లి ఫీజు కట్టి రా,” అన్నారు. నాకు కోపం వచ్చింది. “వాళ్ళతో వెళ్లేరు కదా, నాతో ఎందుకు రారూ?” అని అడిగేను. “వాళ్ళకి చేతకాదు. నువ్వు చేసుకోగలవు,” అన్నారాయన. ఇది నాకు మొదటిపాఠం నాగురించి నాకు నేను ఆలోచించుకునే విషయంలో. అలాగే మాఅమ్మ కూడా. ఒకసారి ఎవరో, “అమ్మాయిని శ్రద్ధగా చదువుకోమని చెప్పండి,” అంటే, అమ్మ, “నేను చెప్పఖ్ఖర్లేదు. దానికి తెలీదేమిటి,” అనడం విన్నాను. నా యూనివర్సిటీ చదువు అయిపోయేక, నేను విజయనగరం విమెన్స్ కాలేజీలో లైబ్రేరియన్ గా ఒక సంవత్సరం పని చేసేను. అక్కడ ఇద్దరు లెక్చరర్లు, రేణుక, సీతారామమ్మ, నేనూ మంచి స్నేహితులం అయిపోయేం. ముగ్గురం కలిసి మెలిసి తిరుగుతూండేవాళ్ళం. ఒకసారి రేణుకకి భువనేశ్వరంలో ఇంటర్వ్యూ

ఏం చేస్తున్నావమ్మా అక్కడ?

 " ఏం చేస్తున్నావమ్మా అక్కడ? మట్టిలో ఆడుతున్నావా? " అడిగేను మా పదేళ్ళ పాపను. " లేదమ్మా. కాలి మీద చీమ కుడుతుంది తీసి పారేస్తున్నాను" " అయ్యయ్యో. చీమ కుడుతుంటే అంత సున్నితంగా తీస్తే వస్తుందా తల్లీ ? నలిపి పారేయాలి గాని ఏదీ ఇలా రా " అన్నాను " వచ్చేసిందిలే అమ్మా. నలిపి పారేస్తే పాపం చీమ చచ్చిపోదూ? జీవహింస చేయడం మహా పాపమట కదా? " కళ్ళు చక్రాల్లా త్రిప్పుతూ అంది. "ఎవరు చేప్పేరమ్మా నీకు? " కుతూహలంగా ప్రశ్నించేను. "ఈవేళ మా టీచర్ అహింసా పరమో ధర్మః అనే పాఠం చెప్పేరు. దేన్నీ హింసించకుండా ఉండడమే అన్ని ధర్మాలలోకీ గొప్పదట. అదే మానవ ధర్మం కూడానట. చూడమ్మా. కుట్టడం చీమ లక్షణం. అది చచ్చిపోయేటప్పుడు కూడా తన లక్షణాన్ని విడిచిపెట్టడంలేదు.అలాంటప్పుడు మనం మన ధర్మాన్ని ఎందుకు విడిచిపెట్టాలి? దాన్ని హింసించక పోవడమే మన ధర్మం" అంది ఓ ఉపదేశకురాలిలా. " చిన్నదానివైనా ఎంత చక్కగా చెప్పెవమ్మా. అలవాటు ప్రకారం స్కూల్ లో చెప్పిన పాఠం నీ మనసులో ఎంతగా హత్తుకుపోయిందో. పెద్దవాళ్ళ మైనా మేము అంతగా పట్టించుకోలేదు. ఏడీ? మీ అన్నయ్య ఏడీ? ఆ రౌడీ వెధవను ఇలా రమ్మను. వాడి